కలం, మునుగోడు : భార్య మృతితో తీవ్ర మనోవేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చౌటుప్పల్ మండల పరిధిలోని తంగడపల్లి (Tangadapalli) గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగడపల్లి గ్రామానికి చెందిన బుంగపట్ల మహేష్ (33) డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య స్వప్న 16 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. తల్లి మృతి అనంతరం పిల్లలు అమ్మమ్మ వద్ద ఉంటున్నారు.
పిల్లలు దూరంగా ఉండటంతో మహేష్ అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన మహేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహేష్ అన్న మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

