కలం, కరీంనగర్: తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని TGEJAC జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్ టీఎన్జీవోల సంఘ భవనంలో టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్‌రెడ్డి, టీజీవోల జిల్లా అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళీచరణ్‌గౌడ్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, ఈహెచ్ఎస్ సమర్థవంతమైన నిర్వహణ, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ వంటి డిమాండ్ల (Employee Demands)పై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు.
సెప్టెంబర్ 18న జరుగుతుందనుకున్న చర్చలు వాయిదా పడటంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వారు చెప్పారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా నిర్దిష్ట కాలపరిమితితో సమస్యలు పరిష్కరించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పీఆర్సీని ప్రకటించాలని, ఉద్యోగుల జీపీఎఫ్, పదవీ విరమణ పొందిన వారి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల భవిష్యత్తుకు సామాజిక భద్రతనిచ్చే ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, ఈహెచ్ఎస్ (EHS) ఆరోగ్య పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగి ప్రభుత్వానికి శత్రువు కాదని.. పాలనలో భాగస్వామి అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యోగుల మౌనాన్ని బలహీనతగా భావిస్తే ప్రజాస్వామ్యయుతంగా బలమైన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణ్ రావు, టీజీవోస్ జిల్లా కార్యదర్శి డాక్టర్ అరవింద్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గూడ ప్రభాకర్ రెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు విజయకుమార్, మహిళా అధ్యక్షురాలు ఇరుమల్ల శారద, పట్టణ అధ్యక్షుడు మారుపాక రాజేష్ భరద్వాజ్, నాయకులు యు. నాగరాజు, సత్యనారాయణ, నరేష్ పటేల్, సునీత, సూర్య, శైలజ, సుస్మిత, అజ్గర్ అలీ, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోట రామస్వామి, బైరి శ్రీనివాస్, శంకర్, వారీస్ నవాబ్, అజయ్ కుమార్, కమలాకర్, శశి కుమార్, గిరిధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

