కలం, మునుగోడు : నల్లగొండ జిల్లా ఎస్పీ(Nalgonda SP) శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ శుక్రవారం చండూర్ పోలీస్ స్టేషన్ (Chandur Police Station), సర్కిల్ ఆఫీస్‌ను వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, సిబ్బంది విధుల నిర్వహణ, రికార్డు గదులు, సీసీ కెమెరాల పనితీరును ఆయన పరిశీలించారు. స్టేషన్‌లో నమోదైన కేసులు, పెండింగ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ ట్రయల్స్, కోర్టు కేసుల వివరాలను పరిశీలించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, పకడ్బందీగా ఆధారాలు సేకరించి నిర్ణీత సమయంలో చార్జిషీట్లు దాఖలు చేయాలని అధికారులకు సూచించారు. క్రైమ్ రిజిస్టర్, జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్, సీడీ ఫైల్స్, కోర్టు కేసుల రికార్డులు, బీట్ బుక్స్ తదితర రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలు, నేరాలకు అవకాశం ఉన్న ప్రదేశాలు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారి సమస్యలను గౌరవంగా విని, చట్టపరమైన పరిధిలో తక్షణమే స్పందించాలని సిబ్బందికి తెలిపారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచేలా విధులు నిర్వహించాలని సూచించారు.
చండూర్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైన ప్రాంతాల్లో బీట్ పెట్రోలింగ్ పెంచాలని తెలిపారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేసి నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం పోలీస్ సిబ్బంది సంక్షేమానికి సంబంధించిన అంశాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది విధులు, సెలవులు, వసతులు, ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు తెలుసుకుని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తూ చండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ వార్షిక తనిఖీలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, చండూర్ సీఐ రాము, డీసీఆర్‌బీ సీఐ శ్రీను నాయక్, ఎస్‌ఐ శివకుమార్, ఇతర పోలీస్ అధికారులు, చండూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

