అభివృద్ధి ఎక్కడ?.. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తీరుపై బీఆర్ఎస్ భారీ ధర్నా

కలం, ఖమ్మం బ్యూరో: “ఏజెన్సీ రూపురేఖలు మారుస్తా” అని చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు (Bhadrachalam MLA) వైఖరిపై బీఆర్ఎస్ నాయకులు విరుచుకుపడ్డారు. పార్టీ మారినా నియోజకవర్గ దశ-దిశ మారకపోగా, ఎమ్మెల్యే వ్యక్తిగత ఆర్థిక ఉన్నతే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చర్ల మండలం కుదునూరు, దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామాల్లో శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జి రావులపల్లి రాంప్రసాద్, నాయకులు మానే రామకృష్ణ మాట్లాడుతూ.. స్థానిక శాసనసభ్యుడి వైఫల్యాలను ఎండగట్టారు.

భద్రాచలం నుంచి వాజేడు వరకు విస్తరించిన ప్రధాన రహదారి కనీస మరమ్మతులకు నోచుకోక గుంతలమయంగా మారిందన్నారు. గర్భిణులు, రోగులను ఆసుపత్రులకు తరలించలేని నరకప్రాయ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే కార్యాలయం ప్రజాసమస్యల పరిష్కార వేదికగా కాకుండా కమీషన్ల వసూలు అడ్డాగా మారిందన్నారు. పీఏలు, అనుచరులు అధికారులు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు.

​అలాగే గోదావరి తీరంలో సొంత ఏజెంట్లతో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా సాగిస్తూ సంపాదనకే ప్రాధాన్యమిస్తున్నారని, భారీ లారీల రాకపోకలతో అంతర్గత రోడ్లు ధ్వంసమవుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని విమర్శించారు. ఏజెన్సీ అన్నదాతల జీవనాడి అయిన తాలిపేరు ప్రాజెక్టు గేట్ల నిర్వహణ, కాలువల మరమ్మతులను పట్టించుకోకపోవడంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి స్వలాభమే పరమావధిగా పనిచేస్తున్న ఎమ్మెల్యేకు రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>