తల్లుల ఆరోగ్య పరిరక్షణ కుటుంబ బాధ్యత: కలెక్టర్ ప్రియాంక

కలం, నారాయణపేట: తల్లుల ఆరోగ్య పరిరక్షణ కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) స్పష్టం చేశారు. శుక్రవారం ఉట్కూర్ మండలం నిడుగుర్తి రైతు వేదికలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రియాంక పాల్గొని గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కార్యక్రమాల్లో మహిళలతో పాటు పురుషులు కూడా పాల్గొనడం అభినందనీయమన్నారు. బిడ్డ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు గర్భధారణ నుంచే తల్లి ఆరోగ్యం, పోషకాహారం ఎంతో ముఖ్యమని తెలిపారు.

బిడ్డ పుట్టిన వెంటనే అందించే ముర్రు పాలు ఎంతో విలువైనవని, మొదటి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే అందించాలని కలెక్టర్ ప్రియాంక సూచించారు. ఆరు నెలల లోపు శిశువులకు తేనె, నీరు తదితర ప్రత్యామ్నాయ ఆహారాలను ఇవ్వకూడదని తెలిపారు. బాలింతలు సంప్రదాయ నమ్మకాల పేరుతో కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండటం సరికాదన్నారు. వైద్యుల సూచనల మేరకు సమతుల్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

చిన్నారులకు పోషకాహారం..

గర్భధారణ సమయంలో, ప్రసవం అనంతరం, బాలింతగా ఉన్న సమయంలో తగిన పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ ప్రియాంక తెలిపారు. 18 సంవత్సరాల లోపు బాలికలకు వివాహాలు చేయకుండా చట్టపరమైన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. చిన్నారులకు అధిక ఉప్పు, నూనెతో తయారైన ప్యాకేజ్డ్‌ స్నాక్స్‌, జంక్‌ఫుడ్‌ అలవాటు చేయకుండా చూడాలని సూచించారు. పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలతో పిల్లలకు ఆహారం అందించాలని కోరారు.

గర్భిణుల ప్రసవ తేదీలను ముందుగానే గుర్తించి, అవసరమైన వైద్య సేవలు అందేలా ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపం, తక్కువ బరువుతో ఉన్నవారిని గుర్తించి, వారికి అందిస్తున్న అదనపు పోషకాహారం సక్రమంగా అందుతుందా.. లేదా.. అనేది పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా గర్భిణులకు శ్రీమంతం, చిన్నారులకు అన్న ప్రాసన జరిపించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూవో రాజేందర్ గౌడ్, సర్పంచి రాములు, ఉప సర్పంచి సంతోష్ కుమార్, సీడీపీవో వెంకటేశ్వరమ్మ, సూపర్ వైజర్ అంజమ్మ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>