కలం, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ బీసీ గురుకుల (Nagarjunasagar BC Gurukulam) బాలుర పాఠశాల నిరంతర నిర్లక్ష్యానికి, పర్యవేక్షణా లోపానికి మరోసారి నిదర్శనంగా నిలిచింది. శుక్రవారం పాఠశాల హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి 6వ తరగతి విద్యార్థి నరేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
ఈ వార్త తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురుకులంలో పిల్లల భద్రతను గాలికి వదిలేశారని, అసలు పాఠశాల సిబ్బంది పర్యవేక్షణ ఎంతవరకు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. గతంలోనూ ఈ గురుకులంలో పలు దిగ్భ్రాంతికర సంఘటనలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు, ప్రమాదాలను బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
తాజా ఘటనతో గురుకులంలో చదువుతున్న పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, నాగార్జునసాగర్ బీసీ గురుకులంలో జరిగిన వరుస ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన సిబ్బంది, ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

