కలం, ఆదిలాబాద్ : సమాజ అభివృద్ధిలో వృత్తి నైపుణ్యాలు కలిగిన విశ్వకర్మల పాత్ర ఎంతో కీలకమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం సముచిత ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ (Mohammed Shabbir Ali) అన్నారు. గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విరాట్ విశ్వకర్మ జయంతి (Vishwakarma Jayanti) వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో శ్రమకు, సాంకేతికతకు రూపమిచ్చిన విశ్వకర్మ సేవలు చిరస్మరణీయని షబ్బీర్ అలీ (Shabbir Ali) కొనియాడారు. విశ్వకర్మల అభ్యున్నతికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. మహనీయుల జయంతి, వర్ధంతి ఉత్సవాల ద్వారా భవిష్యత్ తరాలకు వారి సేవలు తెలియజేయవచ్చని, తద్వారా యువత మంచి మార్గాన్ని ఎంచుకునే ఆస్కారం ఉందన్నారు. ప్రతి ఒక్కరు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రు, ఎస్.రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషా, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారి సునీత కుమారీ, ఈడీ మనోహర్, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

