నడిరోడ్డుపై యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లా కోరుట్ల(Korutla)లో 5 నెలల క్రితం సంచలనం రేపిన యూట్యూబర్ వైష్ణవి (20) హత్య కేసులో నిందితుడైన భర్త హరిబాబు గురువారం దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ పట్టణంలోని రాజా రాజేంద్ర చౌరస్తాలో నడిరోడ్డుపై జరిగిన హరిబాబు దారుణ హత్య వెనుక “పాత కక్షలు, ప్రతీకారేచ్ఛ” ప్రధాన కారణమనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఐదు నెలల క్రితం స్వంత భార్య, యూట్యూబర్ వైష్ణవిని (YouTuber Vaishnavi) దారుణంగా హత్య చేసిన కేసులో హరిబాబు (Vaishnavi Husband Haribabu) నిందితుడిగా జైలుకు వెళ్లాడు. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దిరోజులకే అతడు దారుణ హత్యకు గురికావడం, పగ తీర్చుకోవడానికి జరిగిన ప్రతీకార హత్యేననే అనుమానాలకు బలమిస్తోంది.

పక్కా స్కెచ్.. పగతోనే దాడి!

హరిబాబు బెయిల్‌పై బయటకు వచ్చినప్పటి నుండి దుండగులు అతడి కదలికలపై నిఘా ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజా రాజేంద్ర చౌరస్తా వంటి రద్దీ ప్రాంతంలో పథకం ప్రకారమే అతడిని చుట్టుముట్టారు. ప్రతీకారంతో రగిలిపోతున్న దుండగులు, అక్కడే ఉన్న కొబ్బరి బొండాల వ్యాపారి కత్తిని లాక్కొని మరి విచక్షణారహితంగా నరికి చంపడం ఈ హత్య వెనుక ఉన్న తీవ్రమైన కక్షను తెలియజేస్తోంది.

వైష్ణవి హత్యకు ప్రతీకారమా?

వైష్ణవి (YouTuber Vaishnavi) దారుణ హత్యతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా అనే కోణంలో నిజామాబాద్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హత్య జరిగిన తీరు, కారులో వచ్చి క్షణాల్లో పని ముగించుకుని పరారైన విధానం చూస్తుంటే ఇది సుపారీ గ్యాంగ్ (కాంట్రాక్ట్ కిల్లర్స్) పని అయి ఉంటుందా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. వైష్ణవి హత్య కేసుతో పాటు హరిబాబుకు కోరుట్ల , ఇతర ప్రాంతాల్లో వ్యాపార, వ్యక్తిగత శత్రుత్వాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కోరుట్ల పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ఆరా తీస్తున్నారని తెలిసింది.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు

ఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను విశ్లేషించిన నిజామాబాద్ పోలీసులు, దుండగులు ఉపయోగించిన కారు నంబర్‌ను గుర్తించే పనిలో పడ్డారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితుల కోసం గాలింపు చర్య తీవ్రతరం చేశారు. పాత కక్షలే ఈ హత్యకు మూలకారణమని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు, త్వరలోనే అసలు సూత్రధారులను బంధిస్తామని స్పష్టం చేశారు.

Also Read : చరిత్ర మరిచినా చెరగని వీరుడు.. రాంజీ గోండు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>