కలం, ఖమ్మం బ్యూరో: రహదారి, రైల్వే, విమాన రవాణా సౌకర్యాల విస్తరణ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రూపురేఖలను పూర్తిగా మారుస్తామని, రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ప్రాధాన్యత కలిగిన రోజు అని, హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం అధికారికంగా ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. జిల్లా అభివృద్ధికి కనెక్టివిటీ కీలకమని స్పష్టం చేసిన మంత్రి (Thummala Nageswara Rao), రవాణా రంగంలో పలు కీలక ప్రాజెక్టులపై చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు.
పాండురంగాపురం నుంచి మాల్కంగిరి వైపు రైలు మార్గం అభివృద్ధి ద్వారా పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి రైల్వే కనెక్టివిటీ కల్పించే పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అమరావతి–జగదల్‌పూర్ జాతీయ రహదారిని కొత్తగూడెం, భద్రాచలం మీదుగా నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నామని తెలిపారు. అలాగే కొత్తగూడెం–ఇల్లెందు–హైదరాబాద్ మార్గాన్ని మరింత సులభతరం చేయడంతోపాటు జిల్లాలోని ఇతర ప్రధాన రహదారుల పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టామని చెప్పారు.
జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, గోదావరి నదీ మార్గం ద్వారా కూడా రవాణా అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. తద్వారా దేశ నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకోవడానికి సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. దీంతో పర్యాటకంగానూ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లాలో మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీతోపాటు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో విద్యా, వైద్య రంగాల్లో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి, విద్యుత్ ఉత్పత్తిలో పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా జిల్లా కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం. విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : జిన్‌పింగ్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. అసలేం జరిగింది?
Follow Us On: X(Twitter)

