కలం, స్పోర్ట్స్ : పాకిస్థాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌సీసీఐఏ సమన్లను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు కొట్టివేసింది. ఎన్‌సీసీఐఏ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని, ఏజెన్సీ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్‌లను ఎన్‌సీసీఐఏ విచారణకు పిలిచింది. ఇద్దరూ లాహోర్‌లోని ఎన్‌సీసీఐఏ కార్యాలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరికీ ప్రశ్నావళి ఇచ్చారు.
ఇందులో వారి ప్రయాణాలు, ఆర్థిక వివరాలు, వ్యక్తిగత, క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై సమాచారం కోరినట్లు తెలుస్తోంది. ఇమామ్ ఉల్ హక్ తన సమాధానాలను గడువులోగా సమర్పించాడు. రిజ్వాన్ మాత్రం విచారణ ఆధారం, ఎన్‌సీసీఐఏ అధికార పరిధిపై ప్రశ్నలు లేవనెత్తాడు. తనపై స్పష్టమైన ఆరోపణ ఏదీ లేదని రిజ్వాన్ వాదించాడు. ఎన్‌సీసీఐఏ తనను ఏ అంశంపై విచారిస్తోందో కూడా స్పష్టత లేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో విచారణను నిలిపివేయాలని రిజ్వాన్ కోర్టును కోరాడు. అయితే కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ఇంగ్లండ్ పర్యటన తర్వాత అంతర్గత విచారణ చేపట్టింది. క్రమశిక్షణ, ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నట్లు బోర్డు తెలిపింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ 3-0తో ఓడిపోయింది. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో ఓటమి తర్వాత రిజ్వాన్, ఇమామ్ సహా ఏడుగురు ఆటగాళ్లను స్వదేశానికి పంపించారు.
ఆ తర్వాత పాకిస్థాన్ జట్టులో పలు మార్పులు జరిగాయి. ఐదుగురు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు సహా ఏడుగురిని జట్టులోకి తీసుకున్నారు. హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లను కూడా తొలగించారు. ఇప్పుడు రిజ్వాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్‌సీసీఐఏ విచారణ కొనసాగనుంది.

