శ్రీనివాస్ నగర్ నిర్వాసితులకు పువ్వాడ మద్దతు: బాధితులతో ఫోన్‌లో మాట్లాడిన మాజీ మంత్రి!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) నగరంలోని శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో ఇళ్ల కోసం గత రెండు రోజులుగా పోరాటం చేస్తున్న నిర్వాసితులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గురువారం బాధితులతో ఆయన ఫోన్‌లో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

శ్రీనివాస్ నగర్ నిర్వాసితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వకుండా వారి తరఫున న్యాయబద్ధంగా పోరాడతామని బలమైన భరోసా ఇచ్చారు. ఇళ్ల కోసం పోరాడుతున్న బాధితుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

​కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసం, కూల్చివేతలు తప్ప మరొక ఎజెండా కనిపించడం లేదని పువ్వాడ అజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదల కోసం కొత్తగా నిర్మించిన ఇళ్ల కంటే, వివిధ కారణాలతో కూల్చేసి రోడ్డున పడేసిన ఇళ్లే ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వికాసం, అభివృద్ధి చేపట్టడం చేతకాని ప్రభుత్వం పేదల పొట్ట కొడుతోందని, ఇళ్లను కూల్చివేసి వారి జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదని మండిపడ్డారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేదల ఇళ్ల కూల్చివేత ఆలోచనను వెంటనే విరమించుకోవాలని సూచించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం నగరంలో అనేకమంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించడంతో పాటు గృహ వసతి కల్పించామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడం అభివృద్ధికి నిదర్శనమైతే, ఇప్పుడు ఉన్న ఇళ్లను కూల్చివేయడమే కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రి తుమ్మలకు మిగిలిన ఘనత అని ఎద్దేవా చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>