కలం, మహబూబ్ నగర్ బ్యూరో: హక్కుల కోసం పోరాటాలు చేస్తున్న కార్మిక సంఘాలను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధాలతో అనచివేయాలని చూస్తున్నాయని, వాటిని ఆపకపోతే పార్టీలకు పుట్టగతులు ఉండవని సీఐటీయూ (CITU) జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సామూహిక నిరసన ధర్నా చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ (CITU) జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కార్మికులకు ఇచ్చిన ప్రధాన కోరికలను అమలు పరచకుండా, ఇంకోవైపున కార్మిక ఉద్యమాలపై అరెస్టులు కేసులు గృహనిర్బంధాలు, మహిళా కార్మికులను చూడకుండా చీరలు లాగడం, రవికలు చించడం లాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు.
స్త్రీలను ద్వందార్థాలతో దూషించారు..
అనేక రూపాల్లో మగ పోలీసులతో స్త్రీలను ఇబ్బందికరంగా ద్వందర్థలతో దూషించారని అన్నారు. ఉద్యమాలను అనచాలని చూడటం ప్రభుత్వాలకు సాధ్యం కాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన వేతనాలు పెంచుతామని.. కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పిస్తామని, స్కీమ్ వర్కర్లను గుర్తిస్తామని, పర్మినెంట్ చేస్తామని వాగ్దానాలు ఇచ్చి పెడచెవిన పెట్టిందన్నారు.
హామీలు అమలు చేయాలి..
అలాగే ‘చలో హైదరాబాద్’ వెళ్లకుండా ఆశా అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. గ్రామపంచాయతీ, మున్సిపల్, వీవోఏ, మధ్యాహ్న భోజనం, భవనిర్మాణ కార్మికులు, హమాలీలకు ఇచ్చిన వాగ్దానాలు తక్షణమే అమలు చేయాలని మోడీ, రేవంత్ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోట్లతో కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తుందని.. కేంద్ర కనీస వేతనాల సలహా బోర్డులో సీఐటీయూను చేర్చకుండా కార్మికులను అవమానించిందని దుయ్యబట్టారు.
ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి సావిత్రి మాట్లాడుతూ.. నిర్బంధలతో ఉద్యమాలను ఆపాలనుకోవడం ప్రభుత్వాలకు సాధ్యం కాదన్నారు. మహిళా కార్మికులని చూడకుండా ద్వందార్థాలతో మగ పోలీసులతో వేధింపులకు దాడులకు, దౌర్జన్యాలకు, గృహనిర్బంధాలకు పాల్పడడం ఆపాలని డిమాండ్ చేశారు. బీసీ జాగృతి సేన రాష్ట్ర కార్యదర్శి బూరుగుపల్లి కృష్ణయ్య యాదవ్ మాట్లాడుతూ.. కార్మిక హక్కులను హరిస్తే ఉద్యమాలు, తిరుగుబాటులతో ప్రభుత్వాలను గద్దెధించాలన్నారు.
ఆశాలు, అంగన్వాడీలు, భవనిర్మాణ కార్మికులు, వీవోఏలు, గ్రామపంచాయతీ మున్సిపల్ హమాలీలు, తదితర రంగాల నుంచి సుమారు 500 మంది కార్మికులు నిరసన ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అనంతరం డీఆర్ఓ, ఏవోలకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకురాలు పద్మ, అమృత గ్రామపంచాయతీ నాయకులు వెంకటేష్ గౌడ్, నారాయణ, వెంకట్ రాములు మున్సిపల్ యూనియన్ నాయకులు చంద్రశేఖర్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వరద, పడాల వెంకటయ్య, ఎర్ర వెంకటయ్య నాగన్న తదితరులు పాల్గొన్నారు.
Also Read : గోల్డ్ డిఫెండ్కి భారత్ రెడీ.. కెప్టెన్ పుష్ప రాణా
Follow Us On : WhatsApp

