కలం, స్పోర్ట్స్ : వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Sooryavanshi) తుది జట్టులో చోటు దక్కకపోవడంపై చర్చ జరుగుతున్న వేళ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(Sanju Samson) కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఆటగాళ్ల మధ్య పోటీ సహజమేనని, అయితే వ్యక్తిగత పోటీ కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశాడు. బయటివారికి మాత్రమే ఆటగాళ్ల మధ్య పోటీ కనిపిస్తుందని, తమకు మాత్రం జట్టు విజయం సాధించడమే ప్రధానమని తెలిపాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగగా.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
జింబాబ్వే సిరీస్‌లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచినప్పటికీ వైభవ్(Vaibhav Sooryavanshi)కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. తొలి టీ20లో సంజూ 8 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేయగా.. రెండో టీ20లో మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 22 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. సంజూ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన సంజూ (Sanju Samson).. వైభవ్, అభిషేక్ తనకు పోటీదారులుగా కనిపించడం లేదని చెప్పాడు. ఎవరికైనా అవకాశం రాకపోవడంపై నిరాశ చెందడం లేదా మరో ఆటగాడికి ఎందుకు అవకాశం ఇచ్చారనే ఆలోచనలో ఉండటం జట్టుకు ఉపయోగపడదని పేర్కొన్నాడు. గతంలో తాను కొన్ని మ్యాచ్‌లలో విఫలమైన సమయంలో వైభవ్ మంచి ఫామ్‌లో ఉన్న విషయాన్ని సంజూ గుర్తుచేశాడు. జట్టు విజయాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పట్లో వైభవ్‌కు అవకాశం ఇవ్వడం సహజమేనని చెప్పాడు. జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ మూడు మ్యాచ్‌ల్లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. దీంతో సంజూ మరోసారి జట్టులో తన స్థానంపై ఒత్తిడిని ఎదుర్కొన్నాడు.
సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపైనా సంజూ స్పందించాడు. వాటికి దూరంగా ఉండేందుకు కొన్నిసార్లు వైఫై ఆఫ్ చేసుకుంటానని సరదాగా చెప్పాడు. అయినప్పటికీ కొన్ని కామెంట్లు తన దృష్టికి వస్తాయని, విమర్శలు ఆటగాళ్లపై ప్రభావం చూపుతాయని అంగీకరించాడు. అయితే అనుభవంతో వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నానని తెలిపాడు. ఇక రెండో టీ20లో అభిషేక్ శర్మ 19 బంతుల్లో 39 పరుగులు చేయగా.. నితీశ్ రెడ్డి మూడు వికెట్లు తీశాడు. భారత్ 163 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.5 ఓవర్లలోనే ఛేదించింది. సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న టీమిండియా.. మిగిలిన మ్యాచ్‌లో తుది జట్టులో ఎలాంటి మార్పులు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read : KCR ఫామ్‌హౌజ్ పై సీఎం సంచలన నిర్ణయం..!
Follow Us On : WhatsApp

