భారత నౌకను ఢీకొన్న పాక్‌ నేవీ షిప్‌.. తీవ్రంగా స్పందించిన భారత్‌

కలం, వెబ్ డెస్క్: ఉత్తర అరేబియా సముద్రంలో భారత నౌకాదళ నౌకను పాకిస్థాన్‌ నేవీకి చెందిన నౌక ఢీకొన్న ఘటనపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పాకిస్థాన్‌ హైకమిషన్‌ చార్జ్‌ డి అఫైర్స్‌ సాద్‌ అహ్మద్‌ వారైచ్‌ (Saad Ahmad Warraich) ను బుధవారం విదేశాంగ శాఖ పిలిపించి నిరసన తెలిపింది. పాకిస్థాన్‌ నౌకాదళ యూనిట్‌ వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యం కాదని, సముద్రంలో పాటించాల్సిన వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

అంతర్జాతీయ జలాల్లో ఢీకొన్న నౌకలు

ఈ ఘటన మంగళవారం సాయంత్రం ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో చోటుచేసుకున్నట్లు భారత వర్గాలు వెల్లడించాయి. సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నౌక వైపు పాకిస్థాన్‌ నౌక వేగంగా దూసుకొచ్చిందని, అనంతరం సురక్షితంగా లేని విధంగా దిశ మార్చుకోవడంతో ఢీకొన్నట్లు పేర్కొన్నాయి. అయితే ఈ ఘటనలో పెద్దగా నష్టం సంభవించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

1991 ఒప్పందాన్ని ప్రస్తావించిన భారత్‌

పాకిస్థాన్‌ నౌక వ్యవహరించిన విధానం 1991లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కుదిరిన సైనిక విన్యాసాలు, కదలికలపై ముందస్తు సమాచార మార్పిడి ఒప్పందంలోని ఆర్టికల్‌ 10కు విరుద్ధంగా ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది. సముద్రంలో ఇరు దేశాల నౌకాదళాలు పరస్పర భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని భారత్‌ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

జాగ్రత్తలు పాటించాలని పాక్‌కు సూచన

భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాకిస్థాన్‌ సైనిక, నౌకాదళ యూనిట్లు సముద్రంలో తగిన జాగ్రత్తలు పాటించాలని భారత్‌ సూచించింది. ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న ఒప్పందాలను పూర్తిగా గౌరవించాలని పాకిస్థాన్‌ రాయబారికి తెలిపింది. ఈ సందేశాన్ని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖకు చేరవేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో ఇస్లామాబాద్‌లోని భారత చార్జ్‌ డి అఫైర్స్‌ ద్వారా పాకిస్థాన్‌ విదేశాంగ శాఖకు అధికారికంగా నిరసన తెలియజేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Also Read : ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>