కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) ను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Minister Bandi Sanjay) స్పష్టం చేశారు. మంగళవారం నగరం పరిధిలోని 13, 42, 49 డివిజన్లలో మున్సిపల్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి (Bandi Sanjay) మాట్లాడుతూ.. కరీంనగర్ ప్రజలకు త్వరలోనే డంపింగ్ యార్డ్ (Dump Yard) సమస్య నుంచి ఉపశమనం లభించనుందని తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ. 16 కోట్లతో చేపడుతున్న డంపింగ్ యార్డ్ పనులకు వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. దీనికి అదనంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) నుంచి మరో రూ. 80 కోట్లను డంపింగ్ యార్డ్ పనులకే వెచ్చించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ అభివృద్ధి కోసం రూ. 840 కోట్ల యూసీఎఫ్ నిధులను మంజూరు చేసిందని, త్వరలోనే ఈ నిధులతో నగరం అంతటా పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు
ప్రస్తుతం యూఐడీఎఫ్ (UIDF) కింద రూ. 50 కోట్ల నిధులతో ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అలాగే ప్రతి డివిజన్‌లో ప్రజల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పనుల్లో అలసత్వం వహించే కాంట్రాక్టర్లకు కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేస్తున్నారని, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరని స్పష్టం చేశారు. నగరంలో 42వ డివిజన్ (భగత్ నగర్) లో మమతా థియేటర్ వద్ద నిర్మించిన ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం చేశారు.
పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం
పొలాడి ఆనందరావు అపార్ట్‌మెంట్ గల్లీలో రూ. 50 లక్షల యూఐడీఎఫ్ నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 49వ డివిజన్ (భాగ్యనగర్) లో బాలాజీ సూపర్ మార్కెట్ సమీపంలో రూ. 50 లక్షలతో సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన, పోచమ్మ కమాన్ సమీపంలో రూ. 10 లక్షల మున్సిపల్ నిధులతో సీసీ రోడ్డు, పైప్‌లైన్ పనులకు భూమిపూజ, అనంతరం స్థానిక శ్రీ గాయత్రి అసోసియేషన్ గణేష్ మండపంలో పూజలు చేశారు. 13వ డివిజన్ (శివనగర్ బైపాస్) లారెల్ స్కూల్ సమీపంలో రూ. 75 లక్షల యూఐడీఎఫ్ నిధులతో సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : ‘ధరణి’ పేరుతో వేల ఎకరాల దోపిడీ: సీఎం సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

