కలం, నిర్మల్: జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ పటిష్ట చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (Nirmal SP Janaki Sharmila) తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో నిర్వహించాలని సూచించారు. మండపాల నిర్వాహకులు పోలీసుశాఖతో సమన్వయం చేసుకుంటూ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, రూట్‌మ్యాప్, నిమజ్జన ఏర్పాట్లు, బందోబస్తు తదితర అంశాలపై ఎస్పీ చర్చించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, వివాదాస్పద వ్యాఖ్యలు, వదంతులను ప్రచారం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు కృష్ణ, గోవర్ధన్‌రెడ్డి, సమ్మయ్య, ప్రవీణ్, మల్లేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

