కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన 22A భూ సమస్యలపై శాసనసభలో సుదీర్ఘంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. 22A భూములు, ఎల్ నినో పరిస్థితులపై శాసనసభలో లోతుగా చర్చ జరపాలని ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. అయితే, గతంలో తాము చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే ప్రతిపక్ష నాయకులు సభ నుంచి బయటకు వెళ్లారని ఆయన మండిపడ్డారు.
ప్రజా సమస్యలపై సభలో చర్చ జరగకూడదనే ఉద్దేశంతోనే ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీని అడ్డుకోవడానికి ప్రయత్నించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో వారు నిర్వహించిన క్షుద్రపూజల వ్యవహారాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే వివాదాలు సృష్టించారని ఆరోపించారు.
సభలో స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిని దూషించడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఆ పదవికి పార్టీలతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు. సమావేశాల తొలిరోజే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారని విమర్శించారు. శాసనసభ ప్రాంగణంలో మహిళా పోలీసుల పట్ల బీఆర్‌ఎస్ సభ్యులు అసభ్యంగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. తమ ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటానికే ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

