కలం, వెబ్ డెస్క్ : గుజరాత్‌లోని సూరత్ నగరం నానా వరాచా పరిధిలోని రాజారాంనగర్ సొసైటీలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. అమెరికాలో నివసిస్తున్న ఎన్నారై కిషోర్‌భాయ్‌కి చెందిన ఒక ఇల్లు చాలాకాలంగా మూసి ఉంది. ఈ ఇంట్లో చోరీ (Surat Thief) చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తి, భవనం లోపలికి చొరబడే క్రమంలో ఇనుప గ్రిల్స్ మధ్య దొరికిపోయాడు. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక గ్రిల్‌లోనే అడ్డంగా చిక్కుబడిపోయాడు.
ఉదయాన్నే గ్రిల్‌లో చిక్కుకున్న వ్యక్తిని గమనించిన స్థానికులు అక్కడ గుమిగూడారు. దొంగతనానికి వచ్చి ఇరుక్కుపోయాడని భావించి, ఆగ్రహంతో అతడిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కపోద్రా పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఈ ఘటన జరిగి దాదాపు పది రోజులు కాగా, ఇంట్లో ఎలాంటి నగదు లేదా విలువైన వస్తువులు లేకపోవడంతో ఎలాంటి చోరీ జరగలేదని ఇంటి యజమాని స్పష్టం చేశారు. వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

