కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) నగరంలోని బ్రాహ్మణ వాడలో ఈ ఏడాది వినాయక చతుర్థి ఉత్సవాల్లో అరుదైన ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఇక్కడ గణనాథుడు దక్షిణ దిశగా పూజలందుకుంటూ ఏకైక దక్షిణ ముఖ గణపతిగా ప్రత్యేక గుర్తింపు పొందితే, మరోవైపు క్వింటా సీడ్ బాల్స్‌తో రూపొందించిన 40 అడుగుల భారీ సూర్యప్రభ వాహన దక్షిణా మూర్తి స్వరూప విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దేశంలోనే తొలిసారిగా క్వింటా విత్తన బంతులను (సీడ్ బాల్స్) ఉపయోగించి ఈ 40 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు అత్యంత వైభవంగా తీర్చిదిద్దారు. నిమజ్జనం అనంతరం ఈ విత్తన బంతులు భూమిలో కలసి వివిధ రకాల మొక్కలుగా మొలకెత్తి ప్రకృతికి మేలు చేస్తాయి. సాధారణంగా వినాయక ప్రతిమలు తూర్పు లేదా ఉత్తర దిశలను చూస్తూ కొలువుదీరుతాయి. కానీ, ఇక్కడ స్వామివారు దక్షిణ ముఖంగా కొలువుదీరి పూజలందుకోవడం దేశంలోనే అరుదైన విశేషంగా నిలిచింది.
కాగా, 1994లో కేవలం ఒక అడుగు విగ్రహంతో ప్రారంభమైన బ్రాహ్మణ వాడ గణేష్ ఉత్సవ సమితి ప్రస్థానం, నేడు 40 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించే స్థాయికి చేరింది. సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సమితి 2016 నుంచే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) విగ్రహాల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, కేవలం పర్యావరణ హిత ప్రతిమలనే ప్రతిష్ఠిస్తోంది. ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ స్పృహను చాటుతున్న ఈ అరుదైన దక్షిణా మూర్తి గణపతిని దర్శించుకోవడానికి నగర వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు.

