తెలంగాణ విమోచన దినోత్సవంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

కలం, కరీంనగర్ బ్యూరో: గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప్ అభియాన్–జన్ సేవా హీ ప్రభు సేవా’ పేరిట విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

నెలరోజుల పాటు వివిధ కార్యక్రమాలు

సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు ‘సేవ–అంకితభావం–25 సంవత్సరాలు’, ‘వికసిత భారత్’ అంశాలపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, ప్రసంగ పోటీలు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7 వరకు ‘ఆంగన్ మిలన్ సేవ’ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలను ఘనంగా సన్మానించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ‘సేవా సేతు అభియాన్’ కింద అసెంబ్లీ, మండల స్థాయిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు ఒకేచోట అందించనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 7న ‘సేవా జ్యోతి కలశ యాత్ర’ నిర్వహించి 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. వడ్నాగర్‌లోని హటకేశ్వర్ మహాదేవ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాల్లో పవిత్ర నదీ జలాలతో జలాభిషేకాలు నిర్వహించే కార్యక్రమాలు కూడా ఉంటాయని వెల్లడించారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవం

మజ్లిస్ పార్టీకి భయపడి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana Liberation Day 2026) అధికారికంగా నిర్వహించడం లేదని బండి సంజయ్ విమర్శించారు. అమరవీరుల బలిదానాలను ఈ పార్టీలు అవమానిస్తున్నాయని ఆరోపించారు. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఊరూవాడా విమోచన వేడుకలు నిర్వహించడంతో పాటు తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చుతామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విమర్శలు

అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై నాటకాలు ఆడుతూ ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. అవినీతి అనే నాణేనికి కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు బొమ్మా–బొరుసులాంటివని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, వారిని ఎందుకు జైలుకు పంపడం లేదని ప్రశ్నించారు. భూములు విక్రయిస్తూ ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుందని ఆరోపించారు. కర్ణాటక తరహాలో తెలంగాణ కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాల మాదిరిగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. నెలరోజుల పాటు నిర్వహించే సేవా కార్యక్రమాలతో పాటు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, కేంద్ర సంక్షేమ పథకాల లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>