కలం, ఖమ్మం బ్యూరో: సింగరేణి బొగ్గు గని కార్మికుల హక్కుల పరిరక్షణకు, రోజువారీ సమస్యల పరిష్కారానికి దశాబ్దాలుగా కీలక వారధిగా నిలుస్తున్న గుర్తింపు సంఘం వ్యవహారం ఇప్పుడు నల్లబంగారు సీమలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ప్రస్తుత గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీల పదవీకాలం ముగిసిపోవడంతో రాబోయే రోజుల్లో తమ గోడును యాజమాన్యం దృష్టికి ఎవరు తీసుకెళ్తారనే అంశంపై వేలాది మంది కార్మికుల్లో తీవ్ర గందరగోళం, ఆందోళన వ్యక్తమవుతున్నాయి.
గతంలో 2023 డిసెంబరు 27న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించగా, ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య హోదాను దక్కించుకుంది. వీరికి 2024 సెప్టెంబరు 9న అధికారిక గుర్తింపు పత్రాలు అందడంతో, నిబంధనల ప్రకారం రెండేళ్ల కాలపరిమితి ముగిసింది. అయితే, గతంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సుదీర్ఘంగా ఆరేళ్ల పాటు బాధ్యతల్లో కొనసాగిన విషయాన్ని గుర్తుచేస్తూ, తమ పదవీకాలాన్ని కూడా నాలుగేళ్ల పాటు పొడిగించాలని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై కార్మిక శాఖ అధికారుల వద్ద జరిగిన చర్చల్లో కాలపరిమితి రెండేళ్లేనని స్పష్టం చేయడంతో వివాదం మరింత ముదిరింది. పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ టీబీజీకేఎస్, హెచ్‌ఎంఎస్ నాయకులు ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కగా, సీఐటీయూ కూడా ఆ పోరాటంలో భాగస్వామ్యమయ్యేందుకు సిద్ధమవుతుండటంతో న్యాయపోరాటం తీవ్రరూపం దాల్చింది. మరోవైపు నూతన ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్ నిబంధనలు పెద్ద సంకటంగా మారాయి.
పాత పద్ధతిలో సాధారణ మెజారిటీ ఓట్లు సాధించిన ఒక్క సంఘానికే పూర్తి గుర్తింపు దక్కేది. కానీ, కేంద్రం ప్రతిపాదించిన కొత్త లేబర్ కోడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిపితే, కనీసం 51 శాతం ఓట్లు సాధించిన సంఘానికి మాత్రమే గుర్తింపు హోదా దక్కుతుంది. ఒకవేళ ఏ సంఘానికి ఆ స్థాయిలో ఓట్లు రాకపోతే, 21 శాతం ఓట్లు సాధించిన సంఘాలకు భాగస్వామ్య ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది. ఎంతోమంది పోటీపడే బొగ్గు పరిశ్రమ క్షేత్రంలో ఒకే సంఘానికి 51 శాతం ఓట్లు రావడం ఆచరణలో దాదాపు అసాధ్యమని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కొత్త నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరిగితే, బొగ్గు గనుల రంగంలో ఈ వినూత్న విధానంలో ఎన్నికలు నిర్వహించే తొలి సంస్థగా సింగరేణి నిలుస్తుంది.
ఈ ఎన్నికల అనిశ్చితి నడుమ సింగరేణి వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సింగరేణిలోని 11 డివిజన్లలో రాజకీయ ప్రాబల్యం సాధించడం ప్రతిష్టాత్మకం కావడంతో ఇప్పటికే ప్రధాన పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తుంటే, బీజేపీ తరఫున కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి క్యాడర్‌ను సమీకరిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘బాయి బాట’ పేరుతో నిరసనలు, గేట్ మీటింగ్‌లు నిర్వహిస్తూ కార్మికుల సమస్యలపై పోరాడుతున్నారు.
ఇక ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎమ్‌ఎస్, టీబీజీకేఎస్, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ వంటి యూనియన్ల నేతలు డిపెండెంట్ ఎంప్లాయ్‌మెంట్, సొంతింటి కల, కంపెనీ లాభాల్లో వాటా, తాడిచర్ల-2 బ్లాక్, మణుగూరు డీప్ సైడ్ మైన్స్ టెండర్ల అంశాలను అస్త్రాలుగా మలుచుకుని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే, ఎన్నికల షెడ్యూల్ గానీ, ఓటర్ల జాబితా సవరణ గానీ జరగకపోవడం, యాజమాన్యం లేదా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో కార్మికుల రోజువారీ సమస్యలు, క్లైమ్‌లు మూలనపడే ప్రమాదం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తే ఎన్నికల ప్రక్రియను నిర్వహించడానికి తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని సింగరేణి అధికారులు చెబుతుండగా, ఇకనైనా యాజమాన్యం స్పందించి ఈ గందరగోళానికి తెరదించి నూతన ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలని కార్మిక వర్గం కోరుతోంది.

