కలం, నిర్మల్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (Nirmal SP Janaki Sharmila) సూచించారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ముస్లిం మత పెద్దలతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో కొనసాగుతున్న సోదరభావం, పరస్పర సహకారం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా ఎదురయ్యే సమస్యలు, అవసరమైన ఏర్పాట్లపై మత పెద్దల నుంచి సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. ప్రజలకు ఏదైనా సమస్య ఎదురైతే పోలీసు శాఖను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు కృష్ణ, ప్రవీణ్, సమ్మయ్య, పోలీసు సిబ్బంది, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

