కలం, ఖమ్మం బ్యూరో : వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిందే తప్ప అది మతాల మధ్య ఘర్షణ కాదని తెలంగాణ గిరిజన సమాఖ్య (TGS) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శేషగిరి భవన్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల హృదయాల నుంచి చెరిపివేయలేరని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 17వ తేదీని రాజకీయ లబ్ధి కోసం, మత విద్వేషాలకు వాడుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ‘విలీన దినం’గా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టుల నేతృత్వంలో ప్రజలు సాగించిన ఉద్యమ వారసత్వాన్ని తుడిచిపెట్టేందుకు జరుగుతున్న కుట్రలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పీడిత ప్రజల హక్కుల సాధనకు ఆనాటి రైతాంగ పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో తెలంగాణ గిరిజన సమాఖ్య ముఖ్య నాయకులు బానోతు వెంకట్, గోవిందు, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.

