కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్(Karimnagar) టౌన్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) కార్యాలయాన్ని రాజన్న జోన్-3 డీఐజీ, సైబరాబాద్ జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ మంగళవారం తనిఖీ చేశారు. కార్యాలయానికి చేరుకున్న ఉన్నతాధికారులకు పోలీస్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తనిఖీల్లో భాగంగా కార్యాలయంలోని నేరాల రికార్డులు, పెండింగ్ కేసులు, సీసీటీఎన్ఎస్ (CCTNS) నిర్వహణ, శాంతిభద్రతల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ బాధితులకు సత్వర న్యాయం అందేలా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, టౌన్ ఇన్‌స్పెక్టర్లు రామచందర్ రావు, తిరుమల్, పుల్లయ్యతో పాటు డివిజన్ పరిధిలోని ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

