కలం, నల్లగొండ: జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నల్లగొండ పట్టణ మునుగోడు రోడ్డులోని ఈద్గా మైదానంలో ఆదివారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు (Nalgonda Muslims Prayers) ఘనంగా నిర్వహించారు. వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటి, సాగు-తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ప్రార్ధనలు చేశారు. నల్లగొండ ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ప్రార్థనలు చేశారు.
సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజల నీటి కష్టాలు తొలగి పశుపక్ష్యాదులు, సమస్త జీవరాశి సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. అనంతరం అందరూ కలసి సామూహికంగా దువా చేశారు. ఈ సందర్భంగా జమియత్ ఉలమా-ఎ-హింద్ తెలంగాణ అధ్యక్షులు, ఈద్గా కమిటీ ప్రతినిధి మౌలానా ఎహసానుద్దీన్ ఖాస్మీ మాట్లాడుతూ.. ఇస్లామీయ సంప్రదాయం ప్రకారం వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు అల్లాహ్‌ను వేడుకుంటూ నమాజ్-ఎ-ఇస్తిస్కా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ప్రవక్త మహమ్మద్ కాలంలోనూ వర్షాల కోసం ఈ విధమైన ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు గుర్తుచేశారు. ప్రార్థనలతో పాటు ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతలను నెరవేర్చాలని మత పెద్దలు పిలుపునిచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ జకాత్ చెల్లించడం, పేదలకు సహాయం అందించడం, పాపాలకు దూరంగా ఉంటూ సమాజంలో సోదరభావం, ఐక్యతను పెంపొందించుకోవాలని సూచించారు.
భూగర్భ జలాలు పడిపోయి వ్యవసాయ రంగానికి తీవ్ర విఘాతం కలుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రార్థనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన మున్సిపల్ అధికారులు, పోలీసు శాఖకు ఈద్గా కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీస్ ఖాన్, పలువురు మత పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

