కలం, వెబ్ డెస్క్ : అన్నమయ్య జిల్లా (Annamayya District)లో ఎర్రచందనం స్మగ్లర్లు మళ్లీ రెచ్చిపోయారు. అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డారు. టాస్క్‌ఫోర్స్, అటవీ సిబ్బంది తనిఖీలు చేపడుతున్న సమయంలో స్మగ్లర్లు తమ వాహనంతో అధికారుల వాహనాన్ని ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలంలో ఉన్న సహచర సిబ్బంది వెంటనే స్పందించి, గాయపడిన అధికారులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
అధికారుల వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం స్మగ్లర్లు వాహనంతో సహా అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు నిందితుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. సరిహద్దు ప్రాంతాలలో చెక్‌పోస్టులను అలర్ట్ చేసి స్మగ్లర్ల ముఠా కోసం వెతుకుతున్నారు.

