కలం, నల్లగొండ బ్యూరో: తెలుగు రాష్ట్రాల జీవధార, కోట్లాది ప్రజల దాహార్తిని తీర్చే నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్ట్ పరిధిలోని కృష్ణా నది నీరు కాలకూట విషంగా మారుతోంది. నీరంతా ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుండడం తీవ్ర ఆందోళన రేపుతోంది. ప్రాజెక్ట్ చరిత్రలోనే ఎన్నడూ చూడని రీతిలో, ఎడమ కాల్వ పైభాగంలోని దయ్యాలగండి సమీపంలో నీరు రంగు మారడమే కాకుండా.. నీటిపైన నూనె లాంటి తెట్టు తేలుతోంది. ఒడ్డున ఉన్న పచ్చటి గడ్డి సైతం మాడిపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. నిత్యం స్వచ్ఛంగా ప్రవహించే కృష్ణమ్మ ఈనెల ప్రారంభం నుంచే కలుషిత ఆనవాళ్లతో కనిపించడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.
విష వ్యర్థాల పారబోతే కారణమా ?
సాగర్ నీళ్లలో ఈ అసాధారణ మార్పు వెనుక పారిశ్రామిక వ్యర్థాల పారబోత కారణంగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం నుంచి సాగర్ వచ్చే ఇన్‌ఫ్లో మార్గంలో అర్ధరాత్రి వేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు విష రసాయనాలు లేదా ఫార్మా వ్యర్థాలను పారబోసి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికే చౌటుప్పల్ వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమైన అనుభవాల దృష్ట్యా ఇది పారిశ్రామిక రసాయనాల ప్రభావమేనన్నభయాలు నెలకొన్నాయి. వీటితో పాటు జలాశయంలో నిబంధనలకు విరుద్ధంగా తిరిగే మర పడవల నుంచి డీజిల్, గ్రీజు వంటి చమురు వ్యర్థాలు కలవడం వల్ల లేదా అక్రమంగా చేపల వేట కోసం నీటిలో ఏవైనా రసాయనాలు కలిపారా..! అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం
సాగర్ నీరు కలుషితమైతే దాని ప్రభావం ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా భారీ స్థాయి ప్రజారోగ్య సంక్షోభానికి దారితీస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలు, ఏపీలోని పలు ప్రాంతాలకు సాగర్ నుంచే ప్రధానంగా తాగునీరు అందుతోంది. సాగర్ ఎడమ కాల్వ ద్వారా ప్రవహించే నీరు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని సుమారు 800 చెరువులను నింపుతుంది. ఈ నీరు విషపూరితమైతే తాగునీటి వ్యవస్థ దెబ్బతినడమే కాక పంట పొలాలు, పశుగ్రాసం, భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి విష వ్యర్థాలను వదిలిన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, నది పరివాహక ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కోట్ల మంది ప్రాణాలతో ముడిపడి ఉన్న సాగర్ జలాల నాణ్యతపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
స్థానికుల తీవ్ర నిరసనలు.. నీటి శాంపిల్స్ సేకరణ
కృష్ణానది నీటిలో కాలుష్య కారకాల పరిస్థితుల తీవ్రతపై స్థానికుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే దయ్యాలగండి ప్రాంతాన్ని ఎన్ఎస్పీ ఎస్ఈ మల్లికార్జునరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు సందర్శించారు. ఈ మేరకు నీటి శాంపుల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఈ క్రమంలోనే నీటి పరీక్షల ల్యాబ్ నివేదికలను అధికారులు అత్యంత వేగంగా, పారదర్శకంగా ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

