కలం, భువనగిరి: శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేకనే బీఆర్ఎస్ నాయకులు మాక్ అసెంబ్లీ (BRS Mock Assembly) పేరుతో వెకిలి చేష్టలకు దిగుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కును కేసీఆర్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిగా కోల్పోయారని విమర్శించారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆరే స్వయంగా తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ వద్ద రచ్చ చేసి రావాలని ఉసిగొల్పారని ఆరోపించారు.
నల్ల టీ-షర్టులపై పేర్లు రాసుకుని వస్తే అసెంబ్లీ లోపలికి అనుమతించరని ముందే ఊహించి, గేటు వద్ద పోలీసులతో కావాలనే పంచాయతీ పెట్టుకున్నారని చామల (MP Chamala Kiran Kumar Reddy) తెలిపారు. నల్ల దుస్తులు ధరించి రావడానికి బదులుగా, చట్టసభకు వచ్చి నేరుగా ప్రజల తరఫున ప్రశ్నించవచ్చు కదా అని నిలదీశారు. మాక్ అసెంబ్లీ పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని, మంత్రులను ఇష్టం వచ్చినట్లు తిడుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు దళితులను, శాసనసభా స్పీకర్‌ను తీవ్రంగా అవమానించారని ఎంపీ చామల మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజకీయాలు మాని ‘సురభి’ నాటక కంపెనీలో చేరితే మంచిదని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలపై మాట్లాడే ఆలోచన లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం రాబోయే వినాయక చవితి, దసరా, దీపావళి ఉత్సవాల్లో నాటకాలు, రికార్డింగ్ డ్యాన్సులకు ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.
రాబోయే సంక్రాంతి పండుగ సమయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆంధ్రప్రదేశ్‌కు పంపిస్తామంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నాయకులను ‘బఫున్లలా’ చూస్తున్నారని, ఇప్పటికైనా ఇటువంటి చౌకబారు నాటకాలు స్వస్తి చెప్పి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు.

