కలం, స్పోర్ట్స్ : ముంబై క్రికెట్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ (Mumbai Cricket Association) తమ అనుబంధ క్లబ్‌ల కోసం సబ్సిడీ కార్పస్‌ను రూ.500 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. వచ్చే పదేళ్లలో ఈ నిధిని పెంచనున్నారు. ఈ నిర్ణయం శుక్రవారం జరిగిన ఎంసీఏ వార్షిక సాధారణ సమావేశంలో తీసుకున్నారు. గ్రాస్‌రూట్ క్రికెట్‌ను బలోపేతం చేయడమే ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం. క్లబ్‌లకు అవసరమైన సదుపాయాలు, పరికరాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు ఇది ఉపయోగపడనుంది.
ఏప్రిల్‌లో ఎంసీఏ రూ.100 కోట్ల కార్పస్‌కు ఆమోదం తెలిపింది. ఇప్పుడు దాన్ని రూ.500 కోట్లకు పెంచింది. ప్రతి ఏడాది రూ.40 కోట్ల చొప్పున నిధికి కేటాయించనున్నారు. ఇదే సమావేశంలో వాంఖడే స్టేడియంలోని లాంజ్‌లకు ప్రముఖ క్రికెటర్ల పేర్లు పెట్టాలని కూడా నిర్ణయించారు. సచిన్ టెండూల్కర్, అజింక్య రహానే, దివంగత మాధవ్ మంత్రి పేర్లతో లాంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
ఇందుకు సంబంధించిన ప్రదేశాలను ఖరారు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జితేంద్ర ఆవ్హాడ్, మిలింద్ నార్వేకర్, న్యాయవాది ఉజ్వల్ నికమ్ ఉన్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అమ్జద్ సయ్యద్‌ను ఎంసీఏ ఓంబుడ్స్‌మన్‌గా నియమించారు. ఎంసీఏ క్రికెట్ కమిటీ పదవీకాలాన్ని కూడా పొడిగించారు. రాజు కులకర్ణి అధ్యక్షుడిగా, సంగీత కట్వారే, ప్రీతి డిమ్రీ సభ్యులుగా ఈ కమిటీ కొనసాగనుంది.

