కలం, సత్తుపల్లి : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను సీపీఎం సత్తుపల్లి(Sathupalli) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లి పట్టణంలోని ఐలమ్మ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.సీపీఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాచర్ల భారతి, సీపీఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. నాటి రజాకార్లు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని తెలిపారు.
రైతాంగాన్ని సమీకరించి, తమ భూముల్లో తామే సాగు చేసుకుని, సేద్య ఫలాలను తామే పొందాలనే హక్కు కోసం ఆమె పోరాటం సాగించారని పేర్కొన్నారు.భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తినిచ్చారని నాయకులు కొనియాడారు. చాకలి ఐలమ్మ వంటి వీరవనితల పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమని అన్నారు. నిజాం నిరంకుశ పాలన, దౌర్జన్యాలు పరాకాష్టకు చేరడంతోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆవిర్భవించిందని వివరించారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను, అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని నాయకులు సూచించారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుల త్యాగాలను వృథా కానివ్వబోమని, వారి ఆశయాల సాధన కోసం సీపీఎం నిరంతరం ప్రజా ఉద్యమాలను నిర్మిస్తుందని తెలిపారు.కార్యక్రమంలో సీపీఎం నాయకులు రావుల రాజబాబు, వెంకటేశ్వరరావు, మీరాజ్, రామకృష్ణ, జిలాని, సీపీఎం మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు శీలం కరుణ, మహిళా సంఘం డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి, మహిళా సంఘం నాయకులు నాగమణి, రాణీ రుద్రమదేవి, భూలక్ష్మి, తిరుమల, సరోజినీ, హేమలత, కృష్ణవేణి, భాస్కర్, చెరుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

