కలం, వెబ్ డెస్క్: ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో ఉండబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్మా సిటీ కోసం మాత్రమే భూ సేకరణ జరిగిందని.. అక్కడ మరో సిటీ పెడితే రద్దవుతుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని నమ్మి.. ఇక్కడ పెట్టుబడులు పెట్టి తరువాత బలిపశువులు కావొద్దని హెచ్చరించారు.
రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తున్న ఉచ్చులో పడితే తమ ప్రభుత్వం వచ్చాక నష్టపోయేది మీరేనని కేటీఆర్ స్పష్టం చేశారు. తుక్కుగూడలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన కంపెనీ టెస్సరాక్ట్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వం కేటాయించిన భూములను హరీశ్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలతో కేటీఆర్ పరిశీలించారు.
సోదరులతోనే సీఎం ఒప్పందాలు..
తెలంగాణకు పెట్టుబడులు తెస్తానంటూ అమెరికా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ తన సోదరులతోనే ఒప్పందాలు చేసుకున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తన సోదరుడు అనుములు జగదీశ్వర్ రెడ్డితో మాట్లాడి రూ.1000 కోట్లు పెట్టుబడులు తెచ్చారని విమర్శించారు. ఇక్కడ కొండల్ రెడ్డికి రూ.250 కోట్ల విలువైన భూములు సీఎం రేవంత్ కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం ప్రజా పాలన అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని చెబుతున్న బీజేపీ వాళ్లకు ఈ దోపిడీ కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏకంగా రాఘవ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ కూడా స్టార్ట్ చేశారని.. దీన్ని బట్టి ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు.

