కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా నూతన జిల్లా అటవీ అధికారిగా (DFO) మందాడి నవీన్ రెడ్డి (Mandadi Naveen Reddy) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన అటవీ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన గురువారం జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో అటవీ సంరక్షణ, పచ్చదనం పెంపు, వన్యప్రాణుల పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు.
వన్యప్రాణుల సంరక్షణలో విశేష సేవలు
మందాడి నవీన్ రెడ్డి యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2019 బ్యాచ్‌లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. గతంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో విధులు నిర్వహించిన సమయంలో వేసవి తీవ్రతలో వన్యప్రాణులకు తాగునీటి కొరత లేకుండా అటవీ ప్రాంతంలో సోలార్ బోర్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా సాసర్ పిట్స్ (నీటి తొట్టెలు) ఏర్పాటు చేయడంలో ప్రత్యేక చొరవ చూపారు. అనంతరం వనపర్తి, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో జిల్లా అటవీ అధికారిగా విధులు నిర్వహిస్తూ అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణలో విశేష సేవలు అందించారు.
అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం
మహబూబ్‌నగర్ జిల్లా అటవీ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి జిల్లాలో అటవీ సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, ప్రాధాన్యతలను వివరించారు. అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ చెట్ల నరికివేతపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫీల్డ్ స్థాయిలో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయడంతో పాటు, జిల్లా వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచేందుకు విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలకు నూతన వేగం తీసుకువస్తామని తెలిపారు.

