కలం, వెబ్ డెస్క్: శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదర్శించిన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ పూర్తిగా నకిలీదని, దానిపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తెలిపారు. అసెంబ్లీలో ‘సంధ్య రావు’ అనే పేరుతో ఉన్న బీఆర్ఎస్ ఖాతాను సీఎం ప్రస్తావించారని, ఎలాంటి ఆధారాలు, వెరిఫికేషన్ లేకుండా నకిలీ వార్తలను ప్రచారం చేస్తూ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన కొద్దిసేపటికే ఆ ఫేక్ అకౌంట్ డిలీట్ కావడాన్ని ప్రవీణ్ కుమార్ ప్రస్తావించారు. ఆ ఖాతాను స్వయంగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వర్గాలే నిర్వహిస్తున్నాయనడానికి ఇదొక స్పష్టమైన నిదర్శనమని ఆయన ఆరోపించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి విషయాలను ముందే సరి చూసుకోకుండా సభ ముందుకు రావడం సరికాదని హితవు పలికారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ ఫేక్ ప్రభుత్వ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంపై సమగ్ర, పూర్తి స్థాయి పోలీసు విచారణ జరిపి నిజానిజాలను బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు.

