కలం, నిజామాబాద్ బ్యూరో : రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లు, గోదాములు, రైస్ మిల్లులు, సిమెంటు, వెజిటేబుల్ మార్కెట్లు, ఎరువుల గోదాములు, పరిశ్రమలు, ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వేలాది హమాలీ కార్మికులు (Hamali Workers) ఇప్పటికీ చట్టబద్ధమైన రక్షణ లేకుండా పనిచేస్తున్నారని, వీరికి సమగ్ర భద్రత కూడిన చట్టం రూపొందించాలని ముల్లె హమాలీ యూనియన్ అధ్యక్షులు ఎం.మోహన్ (M. Mohan) అన్నారు. ఈనెల 15వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హమాలీ కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలంటూ నిజామాబాద్ (Nizamabad) నగరంలోని శ్రద్ధానంద్ గంజిలో పోస్టర్లను ఆవిష్కరించారు.
సమగ్ర చట్టం.. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ఈ సందర్భంగా మోహన్ పాల్గొని మాట్లాడుతూ.. అసంఘటితరంగ హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం, ప్రత్యేక సంక్షేమ బోర్డు లేకపోవడంతో కార్మికులు భవిష్యత్తు అంధకారంగా మారుతుందని, తక్షణమే ఆవైపు చర్యలను చేపట్టాలని అన్నారు. పని ప్రదేశాలలో అనేక ప్రమాదాలు జరిగి వారి కుటుంబాలు రోడ్లమీదకు వస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్యాయమని, వారికి జీవన భృతి కల్పించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
పెన్షన్, బీమా సౌకర్యాలు కల్పించాలి
50 సంవత్సరాలు నిండిన తర్వాత కనీసం పనిచేయలేని స్థితికి నెట్టివేయబడుతున్నారని, వారందరికీ రూ. 10.వేలు పెన్షన్ సౌకర్యం కల్పించి వారిని ఆదుకోవాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల హమాలీలకు గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నెల 15వ తేదీన జరిగే రాష్ట్ర సదస్సులో జిల్లా నుండి పెద్ద ఎత్తున హమాలీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వెజిటేబుల్ ముల్లె హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు, దాసు, రఘు, గంగాధర్, సాయిలు, అంజయ్య, రమేష్, జగన్, లచ్చిరాం, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

