కలం, జగిత్యాల: షాద్నగర్ ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్ పై, ఆ నేరాన్ని ప్రోత్సహించిన సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరుతూ బుధవారం జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సీఐ కరుణాకర్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి (Jeevan Reddy), జగిత్యాల జిల్లా పరిషత్ తొలి ఛైర్పర్సన్ దావా వసంత సురేష్, మాజీ మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలతో కలిసి ఫిర్యాదు అందజేశారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్కు భౌతికంగా కీడు జరగాలని కోరడం నేరపూరిత చర్య అన్నారు. పార్టీపరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా, కేసీఆర్ చావును కోరుతూ చావు డప్పులు కొడతామనడం క్షమించరాని నేరమన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా నేరాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై చట్టపరంగా విచారణ చేపట్టాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రశ్నలకు జవాబు చెప్పలేక బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారని ఆరోపించారు. నల్ల దుస్తులతో నిరసనకు వెళ్తున్న మహిళా ఎమ్మెల్యేలను అడ్డుకుని అవమానించారని, బీజేపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శించినా చర్యలు లేవని విమర్శించారు.
దావా వసంత సురేష్ మాట్లాడుతూ.. శంకరయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయకపోవడంపై మండిపడ్డారు. ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్ చేయాలని వసంత డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్లు జీ ఆర్ దేశాయ్, తాటిపర్తి విజయలక్ష్మి, జగిత్యాల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు, కౌన్సిలర్ దేవేందర్ నాయక్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు గాజుల రాజేందర్, కళ్ళేపెల్లి దుర్గయ్య, అల్లాల రమేష్ రావు, నక్క జీవన్, అవారి శివకేసరి బాబు, నాయకులు గంగిపెల్లి శేఖర్, వొళ్లెం మల్లేశం, రూప, తదితరులు పాల్గొన్నారు.

