కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే రైతు బీమా పథకం (Rythu Bima)పై మరోసారి చర్చ మొదలైంది. రైతు బీమా పథకాన్ని నిలిపివేసిన ప్రభుత్వం.. దీనికి కొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఇకపై ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ ( Indiramma Kutumba Jeevitha Bheema Scheme )పేరుతో పథకాన్ని నవంబర్ 19 నుంచి తిరిగి ప్రారంభిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ నిర్ణయంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.5 లక్షల సాయం కొనసాగిస్తామన్న ప్రభుత్వం
రైతు బీమా పథకానికి బదులుగా తీసుకురానున్న కొత్త పథకంలో గత ప్రభుత్వం అందించిన విధంగానే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పథకం పేరు మారినా.. లబ్ధిదారులకు అందే ఆర్థిక ప్రయోజనంలో మార్పు ఉండదని స్పష్టం చేసింది. అయితే రైతు బీమా పథకానికి సంబంధించి ఇప్పటివరకు రెన్యువల్ ప్రీమియం చెల్లించకపోవడంపై ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బీమా కొనసాగింపుపై స్పష్టత లేకపోవడంతో రైతు కుటుంబాల్లో కూడా అయోమయం నెలకొంది.
పేరు మార్పుపై రాజకీయ విమర్శలు
రైతు బీమా పథకం అమలులో జాప్యం, రెన్యువల్ ప్రీమియం చెల్లింపుపై విమర్శలు వస్తున్న సమయంలోనే ప్రభుత్వం కొత్త పేరుతో పథకాన్ని ప్రకటించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విమర్శలకు సమాధానం చెప్పకుండా పథకం పేరును మార్చడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, కొత్త పథకాన్ని నవంబర్ 19 నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో రైతు కుటుంబాలకు బీమా రక్షణ ఎప్పటి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది, పాత పథకానికి సంబంధించిన బకాయిల పరిస్థితి ఏమిటన్న అంశాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

