కలం, కరీంనగర్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ చాటితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. క్రీడలను కేవలం కాలక్షేపంగా కాకుండా లక్ష్యంతో ఆడాలని సూచించారు. కరీంనగర్ పద్మనగర్లోని మానేరు సిబిఎస్ఇ స్కూల్ లో ఘనంగా నిర్వహించిన 70వ ఎస్.జి.ఎఫ్ (SGF) కరీంనగర్ అర్బన్ లెవెల్ అండర్-14&17 బాలబాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ (2026-27) ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ.. కరీంనగర్ అర్బన్ పరిధిలోని దాదాపు 70 పాఠశాలల నుండి 2,500 మందికి పైగా విద్యార్థులు ఈ కబడ్డీ పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. కబడ్డీ అనేది మన గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన సాహసోపేతమైన, శారీరక దారుఢ్యం, సాంకేతిక నైపుణ్యంతో కూడిన క్రీడ. క్రికెట్లో ఐపిఎల్ మాదిరిగానే నేడు ‘ప్రో కబడ్డీ’ ద్వారా క్రీడాకారులకు లక్షల రూపాయల ఆదాయంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందిని తెలిపారు.
వైభవ్ సూర్యవంశీ వంటి చిన్న వయసు క్రీడాకారులు తమ ప్రతిభతో ప్రపంచ దృష్టిని ఆకర్షించినట్లే, ప్రతి విద్యార్థి తమలోని దాగివున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయాలని సునీల్ రావు అన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని.. ఓటమిని గెలుపుకు నాందిగా భావించి లోపాలను సరిదిద్దుకుంటూ జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిల్లో కరీంనగర్ పేరును నిలబెట్టాలన్నారు. విద్యతో పాటు క్రీడలకు, కుంగ్ఫూ వంటి ఇతర కార్యకలాపాలకు నిరంతరం ప్రాధాన్యతనిస్తూ, ఈ కబడ్డీ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన మానేరు విద్యాసంస్థల అధినేత అనంతరెడ్డికి, తోడ్పాటు అందించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల చైర్మన్ అనంతరెడ్డి, ఎస్సార్ఆర్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ జి.మధుసూదన్ రెడ్డి, ఎస్జిఎఫ్ మాజీ కార్యదర్శి వేణుగోపాల్, పీపీఈటీఏ శ్రీధర్ గౌడ్, ఫిజికల్ డైరెక్టర్స్, పీఈటీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

