కలం, మహబూబ్ నగర్ బ్యూరో: దేశ యువతను మోసం చేయాలని ప్రయత్నించే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఏఐవైఎఫ్ ( AIYF) నాయకులు హెచ్చరించారు. అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు ఈనెల 8, 9, 10వ తేదీలలో యాదగిరిగుట్టలో జరుగుతున్నాయి. దీనికి మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రం నుండి యువత పెద్ద సంఖ్యలో మంగళవారం ఏఐవైఎఫ్ జెండాలతో బయలుదేరారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు మాట్లాడుతూ.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి 11 ఏళ్లుగా నిరుద్యోగులను వంచిస్తున్నారని ఆరోపించారు. రైల్వే, ఆర్మీ, ఎస్‌ఎస్‌సీ వంటి లక్షలాది ఖాళీలను భర్తీ చేయకుండా, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అదానీ, అంబానీలకు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగం ఇవ్వాల్సింది పోయి అగ్నిపథ్ వంటి మోసపూరిత పథకాలతో యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ. 4000, జాబ్ క్యాలెండర్ అని గొప్పగా హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా యువతను మోసం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు వేల కోట్లలో పెండింగ్‌లో పెట్టి పేద విద్యార్థుల చదువులను అగమ్యగోచరంగా మార్చారన్నారు. చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు.
యువతను నాశనం చేస్తున్న మత్తు:
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, మద్యం యువతను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలని ఏఐవైఎఫ్ నాయకులు అన్నారు. యువత మాదకద్రవ్యాలకు బానిసై వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్నారు. ఉపాధి కల్పించకుండా యువతను మత్తులోకి నెట్టడమే ఈ ప్రభుత్వాల విధానమా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం పాలిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు కొండపల్లి రాము, లక్ష్మణ్, రాజశేఖర్, పవన్, బద్రి, గూడుబాషా, తదితరులు పాల్గొన్నారు.

