కలం, ఖమ్మం బ్యూరో: సోషల్ మీడియా వేదికగా ప్రజలను రెచ్చగొట్టేలా పోస్టులు చేయడం, విద్వేషాలను ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ (SP Rohith Raj) హెచ్చరించారు. జిల్లాలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న కార్యకలాపాలపై మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సంబంధిత పోలీసు అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా ప్రజలను ప్రభావితం చేసే హ్యాండ్లర్లు, వారు ప్రచారం చేస్తున్న పోస్టులు, వీడియోలు, సందేశాలపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రాజకీయ, మతపరమైన, కమ్యూనల్ అంశాలపై సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న పోస్టులను వెంటనే గుర్తించి, వాటిని తొలగించే చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
వివాదాస్పద పోస్టులు చేసే వ్యక్తులతో పాటు, వాటిని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసే సోషల్ మీడియా హ్యాండ్లర్లపైనా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు లేదా నిర్ధారణ లేని సమాచారాన్ని ప్రచారం చేయడం, ప్రజలను రెచ్చగొట్టే పోస్టులను షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడం వంటి చర్యలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ సమాజంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ రోహిత్ రాజ్ కోరారు. ఈ సమావేశంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ ఇ. శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్‌తో పాటు పోలీసు శాఖకు చెందిన సోషల్ మీడియా హ్యాండ్లర్లు పాల్గొన్నారు.

