కలం, నేషనల్ డెస్క్ : ఐదు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల నగారా మోగింది. పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్ (Nandigram Bypoll), రెజీనగర్.. తమిళనాడులో మధురాంతకం, ధరాపురం.. పుదుచ్చేరిలో తట్టంచావాడి అసెంబ్లీ స్థానాలకు.. అసోంలోని నాగావ్ లోక్ సభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం బైపోల్ షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 6న పోలింగ్ నిర్వహించి.. అక్టోబర్ 9న ఓట్లను లెక్కించనుంది. సెప్టెంబర్ 9న నోటిఫికేషన్ వెలువడనుండగా.. 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న పరిశీలన, 19న ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుంది.
తమిళనాడులో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు మారగథం కుమారవేల్, పి. సత్యభామ రాజీనామా చేసి టీవీకే పార్టీలో చేరడంతో మధురాంతకం, ధరాపురం స్థానాలు ఖాళీ అవ్వగా.. పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి మంగళం నియోజకవర్గాన్ని ఉంచుకుని తట్టంచవాడి స్థానాన్ని వదులుకోవడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. అసోంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ప్రద్యుత్ బోర్డోలోయ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో నాగావ్ లోక్‌సభ స్థానానికి ఈ ఉపఎన్నిక జరుగుతోంది.
నందిగ్రామ్‌పై ఉత్కంఠ..
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి, హుమాయూన్ కబీర్ తాము గెలిచిన రెండు సీట్లలో నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేయడంతో బైపోల్ జరుగుతున్నది. 2021లో ఇదే నందిగ్రామ్ లో సువేందు చేతిలో ఓడిన టీఎంసీ అధినేత్ర మమత (Mamata Banerjee).. 2026లో భవానీపూర్‌లోనూ ఆయన చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే నంది గ్రామ్ బైపోల్ ఉత్కంఠగా మారింది. మమతా బెనర్జీ మరోసారి ఇక్కడి నుంచి బరిలోకి దిగుతారా లేదా సరికొత్త వ్యూహంతో వేరే అభ్యర్థిని నిలబెడతారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

