ఆశా వర్కర్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి: మనోహర్ రెడ్డి

కలం, పెద్దపల్లి: తమ సమస్యలు పరిష్కరించి, న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరుతూ సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు (ASHA Workers) ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ దాసరి మమతారెడ్డిలు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి (Dasari Manohar Reddy ) మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.

తక్కువ పారితోషికంతో, అనేక రకాల బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లపై అదనపు పనిభారం, టార్గెట్లు మోపడం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. ఆశా వర్కర్లపై విధిస్తున్న టార్గెట్లను ఎత్తివేయాలని, ఖాళీగా ఉన్న ఆశా వర్కర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఆశా వర్కర్లను BLO విధుల నుంచి తొలగించాలని, ఆశా వర్కర్లకు నెలకు రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని అన్నారు.

ఆశా వర్కర్లకు హెల్త్ కార్డులు జారీ చేయాలని, ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎంతో కీలకమైనవని దాసరి మనోహర్ రెడ్డి కొనియాడారు. వారి సేవలను గుర్తించి గౌరవప్రదమైన వేతనం, మెరుగైన పని పరిస్థితులు, సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ దాసరి మమతారెడ్డి మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల డిమాండ్లు న్యాయమైనవేనని, ప్రభుత్వం వారి సమస్యలను సానుభూతితో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. మహిళా కార్మికులపై అదనపు పనిభారం మోపకుండా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ప్రభుత్వం స్పందించే వరకు వారి తరఫున ప్రజా ఉద్యమానికి అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>