కలం, స్పోర్ట్స్ : భారత్‌తో మ్యాచ్‌లో చేసిన సైగ పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా (Fatima Sana) కు భారీగా తగిలింది. షెఫాలీ వర్మకు సెండాఫ్ ఇచ్చినందుకు ICC చర్యలు తీసుకుంది. ఫాతిమా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. అలాగే ఆమె ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ చేరింది. దుబాయ్‌లో శనివారం భారత్, పాకిస్థాన్ మధ్య మహిళల ఆసియా కప్ మ్యాచ్ (Women Asia Cup) జరిగింది. భారత్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. షెఫాలీ వర్మను ఫాతిమా సనా ఔట్ చేసింది. క్యాచ్ పట్టిన తర్వాత ఆమె పావిలియన్ వైపు సైగ చేసింది.
ఈ చర్య ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.5కు విరుద్ధమని తేలింది. దీంతో ఫాతిమాపై లెవల్-1 ఉల్లంఘన కింద చర్య తీసుకున్నారు. ఫాతిమా తన తప్పును అంగీకరించింది. ఐసీసీ ప్రతిపాదించిన శిక్షను కూడా అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకపోయింది. ఇది 24 నెలల వ్యవధిలో ఫాతిమాకు రెండో తప్పిదం. గతంలో 2025 ఆగస్టు 6న ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆమెకు ఒక డీమెరిట్ పాయింట్ వచ్చింది.
తాజా పాయింట్‌తో ఆమె మొత్తం డీమెరిట్ పాయింట్లు రెండుకు చేరాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం 24 నెలల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు వస్తే అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారుతాయి. ఆ తర్వాత మ్యాచ్‌ల నిషేధం కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఫాతిమా ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. తాజా చర్యతో ఈ వివాదానికి ఐసీసీ నిర్ణయం వెలువడింది.

