కలం, నిజామాబాద్ బ్యూరో : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు, పోలీసుల ద్వారా చేయించిన భౌతిక దాడులను నిరసిస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో భారీ ధర్నా (BRS Protest ) జరిగింది.
ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీల అమలును కోరుతూ నల్ల టీషర్టులు ధరించి శాంతియుతంగా అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దౌర్జన్యం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. నర్సాపూర్ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని లాగడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, మహిళల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి లతో పాటు పలువురు ఎమ్మెల్యేలను కిందపడేసి, తొక్కి, తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. భౌతిక దాడులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

