కలం, నిర్మల్: 22-A భూ వ్యవహారాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో తక్షణమే జ్యుడీషియల్ ఎంక్వైరీ నిర్వహించాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal MLA) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు.
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో బలంగా పోరాడాలని సంకల్పించినట్లు తెలిపారు. పేదల భూములు, అప్రూవ్డ్ లేఅవుట్లు, జీహెచ్ఎంసీ అనుమతులు ఉన్న భూములను సైతం 22-A కింద నిషేధిత జాబితాలో చేర్చి తొలగించే పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై బీజేపీ శాసనసభాపక్షం తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.

