కలం, జోగులాంబ గద్వాల: శారీరక బలానికి, పౌరుషానికి ప్రతీకగా నిర్వహించే సంప్రదాయ సందెరాళ్ల (పందెం రాళ్లు) ఎత్తే పోటీలు జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లాలోని పలు మండలాల్లో యువతను ప్రమాదకర స్టెరాయిడ్స్ వైపు నెడుతున్నాయి. పోటీల సందర్భంగా తాత్కాలికంగా శక్తిని పెంచుకోవాలనే ఉద్దేశంతో స్టెరాయిడ్స్, హార్మోన్ ఇంజెక్షన్లు, పెయిన్‌కిల్లర్ మందులను మోతాదుకు మించి వాడుతున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో గట్టు, కేటీదొడ్డి, ధరూర్, మల్దకల్, అయిజ మండలాలు కర్ణాటక సరిహద్దుల్లో ఉండటంతో పండుగలు, గ్రామ జాతర్లు, ఉర్సుల సమయాల్లో 40 కిలోల నుంచి 120 కిలోల వరకు బరువైన సందెరాళ్లను ఎత్తే పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పోటీల్లో 20–30 ఏళ్ల మధ్య యువకులు బరువులను సులభంగా ఎత్తేందుకు స్టెరాయిడ్స్, పెయిన్‌కిల్లర్ ఇంజెక్షన్లను విచ్చలవిడిగా వాడుతున్నారు.
మత్తులో దాడులు.. ఆస్తుల ధ్వంసం
స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లకు బానిసగా మారిన కొందరు యువకులు మత్తులో కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడటం, ఆస్తులను ధ్వంసం చేయడం వంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు ఇటీవల గట్టు మండలంలో వెలుగులోకి వచ్చాయి. ఒక గ్రామంలో స్టెరాయిడ్ ఇంజెక్షన్లకు అలవాటైన యువకుడు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు.
మరో గ్రామంలో యువకుడు సొంత అన్న కొట్టాడు. ఇంకో గ్రామంలో మరో యువకుడు మోతాదుకు మించి పలుమార్లు స్టెరాయిడ్స్ తీసుకోవడంతో అనారోగ్యానికి గురై చనిపోయాడు. ధరూర్ మండలానికి చెందిన యువకుడు పదేపదే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు తీసుకోవడంతో చేతి రక్తనాళాల్లో సమస్య ఏర్పడి స్పర్శ కోల్పోయాడు. మరో గ్రామంలో స్టెరాయిడ్ ఇంజెక్షన్లకు అలవాటైన యువకులు మత్తులో అంగన్‌వాడీ సెంటర్ తలుపులు విరగ్గొట్టినట్టు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు.
వాట్సప్ గ్రూపుల ద్వారా దందా..
స్టెరాయిడ్స్, యాంటిబయాటిక్స్, హార్మోన్ ఇంజెక్షన్లను వాట్సప్ గ్రూపుల ద్వారా ఆర్డర్లు తీసుకుని సరఫరా చేస్తున్నారు. కర్ణాటక సరిహద్దుల నుంచి గద్వాల నియోజకవర్గంలోని పలు గ్రామాలకు అక్రమంగా తీసుకొస్తున్నారు. అంతేకాదు ఏయే గ్రామాల్లో పోటీలు నిర్వహిస్తారో తెలుసుకొని అక్కడికి వెళ్లి యువతకు స్టెరాయిడ్లు అమ్ముతున్నారు. ఏజెంట్ల ముసుగులో కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులు కూడా దందాలోకి దిగారు.
అధికారుల తనిఖీలు లేకపోవడంతో దొంగచాటుగా ఒక్క స్టెరాయిడ్ ఇంజెక్షన్ రూ.1,500 నుంచి రూ.1,800 వరకు విక్రయిస్తున్నారు. వాటిని అధిక మోతాదులో వాడటం వలన తాత్కాలికంగా శక్తి పెరిగినట్లు అనిపించినా, దీర్ఘకాలంలో గుండె, కిడ్నీలు, కాలేయం వంటి అవయవాలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పల్లెల్లో నిఘా పెంచాలి..
యువత భవిష్యత్తును నాశనం చేసే స్టెరాయిడ్స్, హార్మోన్ ఇంజెక్షన్ల అక్రమ దందాపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. డ్రగ్ కంట్రోల్, పోలీస్ శాఖలు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని పేర్కొంటున్నారు. అక్రమ సరఫరా నెట్‌వర్క్‌లపై దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించే మెడికల్ షాపులను తనిఖీ చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే ఆర్‌ఎంపీపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పోటీలపై దృష్టి: టి.శ్రీను, సీఐ, గద్వాల
గ్రామాల్లో సందెరాళ్ల పోటీలపై దృష్టి సారిస్తామని గద్వాల సీఐ టి.శ్రీను అన్నారు. యువత యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్స్ వాడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్టెరాయిడ్స్ తీసుకునే వారిపైనా సమాచారం అందిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

