ఎమ్మెల్యే vs డీసీసీ చీఫ్.. పరకాల కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్ హీట్!

కలం, వరంగల్‌ బ్యూరో: పరకాల నియోజకవర్గ కాంగ్రెస్‌(Parakala Congress)లో వరుస రాజకీయ పరిణామాలు కలకలంగా మారాయి. ఇప్పటికే మాజీ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ తో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. తాజాగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరాంరెడ్డి వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు హాట్ టాపిక్ మారాయి. ఒకవైపు మాజీ మంత్రి సురేఖ వ్యవహారం నుంచి కేడర్ తేరుకోకముందే, మరోవైపు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ మధ్య ఆధిపత్య పోరు తెరపైకి రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరకాల కాంగ్రెస్‌లో ఒకరి తర్వాత ఒకరు.. వరుస రాజకీయ వివాదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనే అభిప్రాయాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి.

డీసీసీ చీఫ్ బర్త్ డేతో మొదలైన రచ్చ

ఇటీవల డీసీసీ చీఫ్ వెంకటరాంరెడ్డి బర్త్ డే వేడులకు పలువురు సర్పంచులు హాజరుకావడం ఎమ్మెల్యే వర్గంలో అసంతృప్తికి కారణమైంది. ఇటీవల ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి సర్పంచ్‌ను ఆహ్వానించలేదనే ప్రచారం మరో వివాదానికి తెరలేపింది. డీసీసీ చీఫ్ బర్త్ డే వేడుకలకు వెళ్లిన కారణంగానే సర్పంచ్ ను ఎమ్మెల్యే ఆహ్వానించలేదని కొందరు సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక సర్పంచులు ఎవరితో సన్నిహితంగా ఉంటున్నారనే అంశం కూడా రాజకీయ చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు రెండు వర్గాలను సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కార్యకర్తలు చెబుతున్నారు.

స్థానిక ఎన్నికల వేళ ప్రభావమెంత?

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండగా కాంగ్రెస్‌లోని అంతర్గత సమీకరణాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, గ్రామస్థాయి నేతల మద్దతు ఎవరికి ఉంటుందనేది రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది. ఇద్దరు నేతలు సమన్వయంతో ముందుకు సాగుతారా..! లేక ఆధిపత్య పోరు మరింత ముదురుతుందా..! అనేది పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు సాగుతున్న‘కోల్డ్‌వార్‌’ బహిరంగ రాజకీయ పోరుగా మారితే.. దాని ప్రభావం కేవలం ఇద్దరు నేతలకే పరిమితం కాకుండా పరకాల కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహంపైనా పడే అవకాశముందనే చర్చ జరుగుతోంది.

కేడర్ ఎవరి వైపు?

ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ మధ్య నెలకొన్న విబేధాల నడుమ క్షేత్రస్థాయిలో కేడర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చర్చ నడుస్తోంది. ఒక వర్గంతో సన్నిహితంగా ఉంటే మరోవర్గం నుంచి ఇబ్బందులు వస్తాయనే ఆందోళనతో కొందరు నేతలు, కార్యకర్తలు ‘ఎవరి వైపు కాకుండా.. పార్టీ వైపే’ అనే ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా కొండా సురేఖకు చెందిన రాజకీయ పరిణామాల్లో పరకాల కూడా చర్చకు వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడి మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి రాష్ట్రస్థాయి చర్చలోకి వస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>