కలం, నిర్మల్ : అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు బీజేపీ (BJP) శాసనసభాపక్షం సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు.
గత 1,000 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్న అంశాన్ని సభలో ప్రధాన అస్త్రంగా మలచాలని నిర్ణయించారు. హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని సమాధానం చెప్పేలా చేయాలని తీర్మానించారు. సెక్షన్ 22-ఏ భూముల బాధితుల సమస్య, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సహా పలు కీలక ప్రజా సమస్యలను సభలో లేవనెత్తాలని నిర్ణయించారు. విద్యార్థులు, రైతులు, భూముల బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి.. పరిష్కారానికి ఒత్తిడి పెంచాలని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించారు.

