కలం, ఆదిలాబాద్: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారానే భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించగలమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అన్నారు. ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని బంగారు గూడ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల ఆవరణలో ఆదివారం ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. చెట్లు ప్రాణ వాయువును అందించడంతో పాటు వర్షపాతం పెరగడానికి, భూగర్భ జలమట్టాలు పెరగడానికి దోహదపడతాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
ప్రతి విద్యార్థి మొక్క నాటాలి..
ప్రతి విద్యార్థి తమ ఇల్లు, పాఠశాల ఆవరణలో కనీసం ఒక్క మొక్కనైనా నాటి, అది మహావృక్షంగా ఎదిగే వరకు క్రమం తప్పకుండా నీరు పోసి సంరక్షించాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డును కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులకు నూతన దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కలీమ్, వైస్ ఛైర్మన్ రోహిత్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

