హామీలు అమలు చేయడంలో రేవంత్ సర్కార్ వైఫల్యం: జగదీష్ రెడ్డి

కలం, యాదాద్రి భువనగిరి : బీఆర్ఎస్ సమరభేరి లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్య పాలన కార్యక్రమంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని, పక్కాగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని.. యూత్ డిక్లరేషన్ హామీలు వెంటనే అమలు చేయాలని భువనగిరి పట్టణంలో విద్యార్థులు, యువత నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy)  పాల్గొని మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలైన జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, స్కూటీల పంపిణీ, విద్యా భరోసా కార్డులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

రూ.12 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి దాపురించిందన్నారు.కేసీఆర్ హయాంలో ప్రపంచంతో పోటీపడేలా రూపుదిద్దుకున్న గురుకులాలు, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నేడు సర్వనాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జీవో నంబర్ 97ని తీసుకువచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ చేరకుండా వారి భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను, విద్యార్థులను రోడ్డుపాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డి, భువనగిరి మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>