మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తాం: సీతక్క

కలం, నాగర్ కర్నూల్: మహిళా సంఘాలను పొదుపు, రుణ కార్యకలాపాలకే పరిమితం చేయకుండా.. వ్యాపారాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. శనివారం ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి, కొల్లాపూర్ మండలాల పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎంపీ మల్లు రవి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పాల్గొన్నారు.

మహిళా సంఘాలకు నిరంతర ఉపాధి..

కొల్లాపూర్ (Kollapur) పట్టణంలోని రాజా గారి బంగ్లా ఆవరణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారుల యూనిఫాంలు, పాఠశాల విద్యార్థుల యూనిఫాంలు తదితర పనులను మహిళా సంఘాల సభ్యులకు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా వారికి ఉపాధి కల్పిస్తూ.. స్థిరమైన ఆదాయ మార్గాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు. మహిళా సంఘాలే నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఖరీఫ్ సీజన్‌లో రూ.2.53 కోట్ల మేర కమీషన్ ఆదాయం లభించిందన్నారు.

సోలార్ విద్యుత్తుతో ఆదాయం..

మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేసే అవకాశాలను కల్పిస్తున్నామని మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. ఉత్పత్తి చేసిన విద్యుత్తును స్వయంగా వినియోగించుకోవడంతో పాటు మిగులు విద్యుత్తును విక్రయించడం ద్వారా మహిళా సంఘాలకు నెలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. మహిళా సంఘాలకు ప్రత్యేకంగా ఇందిర మహిళా శక్తి భవనాలు నిర్మించి అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.

మహిళా సంఘాలు సమావేశాలు, కార్యక్రమాలను సొంత భవనాల్లో నిర్వహించుకునేలా మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో ఇందిర మహిళా శక్తి భవనం, జిల్లా కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడంతో పాటు సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.

రూ.500 కోట్లతో రహదారుల నిర్మాణం..

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… కొల్లాపూర్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి సుమారు రూ.500 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అదనంగా మరో రూ.100 కోట్లతో రహదారుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రూ.50 కోట్లతో విద్యుత్ సంబంధిత పనులు కొనసాగుతున్నాయని, సుమారు 2,500 మంది విద్యార్థుల కోసం జెట్‌పోల్‌లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులను వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయ భవనాలతో పాటు మండలాల వారీగా సాంస్కృతిక భవనాలు, స్పోర్ట్స్ స్టేడియాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సీఎం చేతుల మీదుగా ప్రత్యేక కార్యక్రమం..

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ‘ప్రభాతభేరి’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి జూపల్లి (Minister Jupally) వెల్లడించారు. ప్రజలు తమ ఆదాయానికి అనుగుణంగా ఖర్చులు చేసుకుంటూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని మంత్రి సూచించారు. విద్య, వైద్యం, సామాజిక కార్యక్రమాలు, ఫంక్షన్ల పేరుతో అవసరానికి మించి ఖర్చు చేయడం కుటుంబాలు అప్పుల పాలవడానికి ప్రధాన కారణాల్లో ఒకటని పేర్కొన్నారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలను పరిమిత వ్యయంతో నిర్వహించుకోవాలని మంత్రి జూపల్లి సూచించారు. యువత సోషల్ మీడియాను కేవలం వినోదానికి మాత్రమే పరిమితం చేయకుండా విద్య, విజ్ఞానం, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి, వ్యాపార అవకాశాలను తెలుసుకునేందుకు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, ఆర్డీవో బన్సీలాల్, కొల్లాపూర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Also Read : నకిరేకల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

Follow Us on : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>